Saturday, October 08, 2011

'అలీఫ్ బే తే'



పూల రెమ్మల్ని పోగేసి ...
పరీలు నాజూకు వేళ్లతో
కాశ్మీరీ ఎంబ్రాయిడరీ ఏదో చేసినట్లు ...
లిపి అల్లికల్లో దూరి నా మనసు వెనక్కు రానంటుంది

నెలవంకల్ని కుప్పేసి
'అలీఫ్ బే తే' ల్ని సృష్టించినట్లు
వెన్నెల సోనలేవో నన్ను
అవ్యక్త పరిమళాల్లోకి లాక్కుపోతాయి

నాజూకు పరీలంతా చేతుల్లో
చేయేసుకుని వనవిహారంలో మునివేళ్లపై
నాట్యం చేస్తున్నట్లు
అక్షరాలు నన్ను కవ్విస్తూ పిలుస్తూ ఉంటాయి

అడవిలో తప్పిపోయిన మనసుకు
సేదతీర్చే శయ్యల్లా
చూడగానే దేహమూ హృదయమూ విప్పారుతాయి

కానైతే పల్లెల్లో
మూలమూలా వెదికినా దొరకదు నా భాష
ఏ సర్కారీ బడిని తట్టి చూసినా నాలుగు ఉర్దూ అక్షరాలు
ఎక్కడా కళ్లని స్పర్శించడంలేదు
నాది కాని భాష ఇవాళ నన్ను ఏలుతున్నది
నా ఇంటిని నా నాలుకను ఆక్రమించింది
నా భాషకు నాకు
కాంతి సంవత్సరాల దూరాల అగాధాలను సృష్టించింది!

ప్రాణప్రాయంలో ఉన్న నా భాషకు
మంచినీళ్లు పోసి బతికించాలని మాత్రం
ఎవరూ చూడ్డం లేదు ...!
ఎవరికీ అనిపించడం లేదు!
ఉర్దూ లాంగ్వేజ్ -మేడ్ ఇన్ ఇండియా!
అంతరించిపోతున్న వాటిల్లో
నా భాషకూడా ... మ్యూజియంలో ...!
ఇప్పుడు అమాంతం చిన్నపిల్లనై
'అలీఫ్ బే తే' లు నేర్చుకోవాలని
మనసు మారాం చేస్తున్నది ...!

చమ్కీ


కలల కుచ్చుముడివీడి
దారాలు దారాలుగా జీవితం
నాలుగ్గోడలకు రోజులను బిగించి
పట్టి పట్టి చేస్తున్న కలల కార్చోప్
రాత్రి చిక్కటి చీకటి మీద
మెరుపులుగా మెరుస్తున్న
కట్ దానా కుందన్లను
ఆలోచనల జరీతో కలబోసి చేస్తున్న కార్చోప్
సాదా చమ్కీ…. దేవదాసి చమ్కీ
రకరకాల రంగుల మెరుపు కలలు
సాదా జీవితానికి
అరబ్ దీనార్ల రంగుల కలలు
రాకుమారుడి రాకకోసం
ఆకాశం తానులో నేసిన నక్షత్రాల స్వాగతం
అన్ని చమ్కీలు చీరమీదకు చేరవు
దారితప్పి కింద పడి
ఊడ్పులో మాసి
బజారులో ఎండకు మెరిసి
ఏ గాలి వేగానికో
బురదగుంటల్లో ఆత్మహత్యించుకుంటాయి
బతుకు
చీరకు వేసిన కట్ దానాలానో
బజారున పడ్డ చమ్కీలానో
ఏ ఎగుమతిలో ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు
ఏ బురద గుంట వడిలో మునుగుతుందో తెలియదు
కానీ మెరవడం దాని జీవలక్షణం
పాతబస్తీ నిండా మెరుస్తున్న చమ్కీలే

నఖాబ్‌ వెనక...

(మానవ ముఖాలపై ఉన్న నఖాబ్‌లను తొలగించే పనికి షాజహానా తన కవిత్వాన్ని సంధిస్తోంది. బలమైన తెలుగు ముస్లిం కవయిత్రి షాజహానా. తన జీవిత నేపథ్యం గురించి, తన తపన గురించి, తన కవిత్వ నేపథ్యం గురించి ఆమె స్వగతం...-'నఖాబ్' కవిత సంపుటి -2005 నుంచి)

తెలియని వయసులో గుమ్మానికి పర్దా కడితే
రంగు రంగుల కుచ్చులు చూసి మురిసిపోయినదాన్ని....!
అప్పుడే స్వేచ్ఛకి మొదటి బేడీ అని తెలుసుకోలేని పసిదాన్ని....!
గుమ్మానికి కట్టనట్టే - అమ్మీ ముఖానికి నఖాబ్‌ కడితే
స్వప్నంలాంటి జిందగీకి శాపమని అప్పట్లో తెలియనిదాన్ని...

అదిగో...
అక్కడ మొదలయ్యాను నేను - ఆ గుమ్మానికి కట్టిన పర్దాలలోంచి అమ్మీలకు తొడిగిన బుర్ఖాలలోంచి నడుచుకుంటూ వచ్చాను నేను...

మా కుటుంబంలోనే కాదు.... మా బంధువుల కుటుంబాల్లో.... ముస్లిం దోస్త్‌ల కుటుంబాల్లో .... అలా ఎన్నో కుటుంబాల్లో... ఎంతో మంది ఆడపిల్లలు రకరకాలుగా బలయిపోతూనే ఉన్నారు. కనీసం తాము బలయిపోతున్నామన్న స్ప­ృహ కూడా లేదు... అది వాళ్ల తప్పు కాదు, అలా స్ప­ృహ లేకుండా చేయడమే పురుష ప్రపంచం కోరుకునేది...
చిన్నప్పటి నుంచి సాహిత్య సమావేశాలకి మా అబ్బా (దిలావర్‌) తీసుకెళుతుండేవారు. ఎంత స్వేచ్ఛనిచ్చినా ఆ స్వేచ్ఛలో కనబడని దారం ఒకటి దాగుండేది. ఆ దారం ప్రధాన శత్రువైంది నాకు. ఆ శత్రువును జయించాలన్న తపనతోనే సాహిత్యంలో కూరుకుపోయేదాన్ని. బయటి ప్రాబ్లమ్స్‌కి సాహిత్యంలో జవాబులు దొరుకుతున్నట్టు అనిపించేది. మా ఇంట్లో ఎప్పుడూ సాహిత్య వాతావరణం ఉండేది. దిలావర్‌గారు ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుంటే వినడం... అలా....

మా చుట్టాలో పదవ తరగతి తర్వాత చదివిన అమ్మాయి ఒక్కరూ లేరు. చిన్నతనంలో పెళ్లి చేసెయ్యడం, అంతలోనే తల్లులు కావడం లాంటి విషయాలు చూస్తుంటే జీర్ణమయ్యేది కాదు.. వాళ్లట్లా పెళ్లయి వెళ్లిపోవడం... బుర్ఖాల్లో మునిగిపోవడం... మళ్లీ కనిపించకపోవడం.... విపరీతంగా దుఃఖం వచ్చేది....

మొదటిసారి బుర్ఖా వేసి చూసినప్పుడు నాకు ఊపిరాడలేదు. చుట్టూతా ఒక పలుచని గోడ కట్టుకుని నడుస్తున్నట్టు అనిపించింది. అది క్రమంగా... నా ఇంటిని ఆక్రమిస్తున్నట్టు అనిపించింది. నా సొంత అక్క (షంషాద్‌ బేగం) పెళ్లవగానే ఆమెను బుర్ఖా కబళించింది. నాకది మింగుడు పడలేదు. ఆ బుర్ఖాలో మా ఆపాను వెతుక్కునేదాన్ని.

ఆ మూడు సార్ల తలాఖ్‌ కొండ చిలువ నా ఆపా నల్లపూసల్ని మింగేసింది. అలా ఎంతో మంది ముస్లిం స్త్రీలు... మా ఆపాలాగే కోర్టుల చుట్టూ గబ్బిలాల్లా తిరుగుతూనే ఉన్నారు.... వారికి న్యాయం ఎన్నటికి అందేను...?

నా ముస్లిం స్నేహితురాళ్లకు బయటకు రావడానికి అస్సలు అనుమతి దొరికేది కాదు. కొట్టాల్లో పశువుల్లాగా కట్టి వుంచడం... టైమ్‌కి వదిలేయడం... ఇలా ఆలోచిస్తూ వుంటే ఎంతో ఆవేశంగా అనిపించేది...

నేను చాలాసార్లు నా సంప్రదాయాల్ని ఎదిరించాను. చాలాసార్లు తిట్లు తిన్నాను. దెబ్బలు తిన్నాను. మా బంధువులందరూ నన్ను చిత్రంగా చూసేవారు. నాతో వాళ్లమ్మాయిల్ని సినిమాక్కాదు కదా బజారుక్కూడా పంపించేవాళ్లు కాదు.... నేనొక్కదాన్నే ఎక్కడికైనా వెళ్లి... ఏదైనా చేయగలగడం నేర్చుకున్నాను. నేను నెమ్మదిగా ఎదిరించకుండా ఉండేటట్లయితే నన్ను కూడా బుర్ఖా ఆక్రమించేది...

మనకి అయిష్టమైనదాన్ని ఎలా తిన్లేకపోతున్నామో... మనకు అసౌకర్యమైన దుస్తులను మాత్రం ఎందుకు ధరించాలి...! ఆ రకంగా ఆలోచిస్తే ముస్లిం ఆడవాళ్ల జీవితాలకు జీవితాలే అసౌకర్యాలు...!

ఊర్లలో ఆడవాళ్లు చెంబు పట్టుకుని ఊరి బైటికి వెళతారు. కానీ ముస్లిం ఆడవాళ్లకు ఆ స్వేచ్ఛ కూడా లేదు. లెట్రిన్స్‌ కట్టుకునే స్తోమత లేని ఇళ్లలో కూడా ఆడవాళ్లు బయటికెళ్లకూడదు. 'సండాస్‌'లలోకి వెళ్లాలి. అవి ఎంత జుగుప్స కలిగించే విధంగా ఉంటాయంటే.... పురుగులు లుకలుకలాడుతూ, ఎలుకలు, బొద్దింకలతో భళ్లున వాంతయ్యింది నాకు, ఒక్కసారి చూసినందుకే...! ఆ కుళ్లు కంపు జీవితాంతం అనుభవించాలి చచ్చినట్టు!

భార్యలు అందంగా ఉండాలని కోరుకోవడం, వాళ్లకి వెలుతురు, గాలీ కూడా స్వేచ్ఛగా పీల్చుకోలేని ఇరుకు గదుల్లో పడేయడం... వాళ్లని మనుషుల్లాగ చూడకుండా తమకి అన్నీ చేసిపెట్టే రోబోట్‌లాగా ఉపయోగించుకుంటున్నారు...

ఎన్ని వేలమంది అమ్మాయిలు అరబ్‌లకు అమ్ముడు పోయారో...! అరబ్బులు ఆ అమ్మాయిలను వాడుకుని ఇతరులకు అమ్మేయడాన్ని తలుచుకుంటే గుండె పగిలిపోతుంటుంది. ఇవన్నీ వింటుంటే చూస్తుంటే తెల్లటి పావురాల్లాంటి అమాయకమైన ముస్లిం ఆడవాళ్లు అచ్చం ఫారాల్లో పెంచే కోళ్లలా అనిపించేవాళ్లు. అంతకంటే ఈ ముస్లిం పురుష ప్రపంచం వాళ్లకిచ్చిందేంటి..?

వాళ్లని బందీల్లా చూడ్డం భరించలేని విషయం. పురుషులు మాత్రం ఆకర్షణీయంగా ఇష్టమైన దుస్తుల్లో తిరుగుతారు. కానీ వాళ్లు మాత్రం కలుగుల్లో ఎలుకల్లా అలా పడుండాల్సిందే.

చివరకు శ్వాస కూడా సరిగ్గా పీలవకుండా నానా రోగాల పాలు చేస్తున్న ఈ పురుష ప్రపంచాన్ని ఏం చేసినా పాపం లేదనిపిస్తుంది. ఎంత రాసినా నా కసి తీరదు. పుట్టేప్పుడు, చచ్చేప్పుడు అందరిదీ ఒకటే బాధ... పెరుగుతున్నప్పుడు మాత్రం ఇన్ని తేడాలేంటి...?

నేను ముస్లింలలో దూదేకులదాన్ని. అచ్చమైన ముస్లింలుగా ఫీలయ్యేవాళ్లు మమ్మల్ని తక్కువ చూడ్డం చూస్తే వాళ్లపై కంపరమెత్తుతుంది. మజీదుల్లోనే అలాయిబలాయిలు...! బయట మాత్రం అగ్రవర్ణ తత్వం ఒంట పట్టించుకుని పెళ్లిళ్లు, పండుగల దగ్గర తేడాలు చూపెడుతున్నారు. వెనకా ముందే తప్ప అందరం ఈ దేశ మూలవాసులమే ముస్లింలుగా మారామన్న సంగతి తెలియక మా మీద ఆధిక్య భావాన్ని ఏర్పరుచుకున్న ' అస్లీ ముస్లిం'ల కళ్లపైని పర్దాల్ని కత్తిరించాల్సిన అవసరం ఉంది.

ఇంట గెల్చి రచ్చ గెలవడమే ఇష్టం నాకు... ఇండ్లలో ఇంత అంధకారాన్ని పెట్టుకుని, బయట ప్రపంచంలో మామూలుగా ఎలా కనబడగలం? 'ప్రత్యేకమైన అవయవాలున్నాయి కాబట్టి బుర్ఖా ధరించాల్సిందే' అనే 'మిత్రుల్ని' చూస్తుంటే ఉమ్మాలనిపిస్తుంది! విశాలమైన యూనివర్శిటీల్లో చదివినవాళ్లు కూడా అంత ఇరుగ్గా ఎలా ఆలోచిస్తారో అర్థం కాకుండా ఉంటుంది. అసహనంగా ఉంటుంది.....!

ఎంత బాధ...! కనీ, కనీ జారిపోయిన గర్భసంచులు...! 'బొమ్మిడికం' చేసీ చేసీ పికిలిపోతున్న శరీరాలు..! జల్లెడయిన మనసులు...! వీటిలో ఒక్క బాధయినా ఈ మగవాళ్లనుభవిస్తున్నారా...?

పవిత్ర గ్రంథాన్ని చదివేవాళ్లు ప్రపంచాన్ని కూడా చదవాల్సిన అవసరం ఉంది. పవిత్ర గ్రంథంలో అట్లా లేదు, ఇట్లా లేదు అనేవాళ్లు తప్పుగా అన్వయించబడుతున్న విషయాల్ని, దాని వల్ల నష్టపోతున్న జిందగీల్ని సరిచేసే పనులు చేయాలి.... లేకుంటే బలైపోతున్న బతుకులకు ఈ తరువాత విలువ ఎవరు కట్టిస్తారు?

అణగారుతున్న జాతిగా ముస్లింల సమస్యలు చెప్పాల్సిన టైమ్‌లో ఈమేంటి స్వేచ్ఛనీ అదనీ ఇదనీ మాట్లాడుతుంది... బుర్ఖా, పర్దా అంటుంది అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇక్కడ బుర్ఖా కేవలం బుర్ఖా కాదు, అది ముస్లిం స్త్రీల చుట్టూ కనిపించకుండా కట్టిన ప్రహరీ గోడ...! ఈ బుర్ఖా వెనక, తలాఖ్‌ల వెనక, అనంతంగా సాగే పురుష అహంకారం కింద అమాయకంగా నలిగే ముస్లిం ఆడవాళ్ల గురించి ఎవరు రాయాలి? ఎప్పుడు రాయాలి? అసలు రాసే టైమ్‌ అంటూ ఒకటి వస్తుందా? ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ని బాధలున్నాయి, సమస్యలున్నాయి. మళ్లీ ప్రత్యేకంగా తెలంగాణ గురించేం మాట్లాడుతారు? అన్నట్లుగా ఉంది ముస్లిం స్త్రీల గురించి చెప్పొద్దనడం...!
దళితులంతా అవమానించబడినవాళ్లే అయినప్పటికీ దళిత స్త్రీ దళిత పురుషుడికి లోకువే! అలాగే ముస్లిం స్త్రీ ఇంకా ఎక్కువ అణచివేతకు గురవుతున్నది... ఆ అణచివేతను ధిక్కరిస్తూ ఇవాళ్ల కొన్ని స్వరాలే వినిపిస్తుండవచ్చు... రేపు పదులు, వందలు, వందలు, వేల సామూహిక స్వరం ముస్లిం పురుష స్వామ్యపు గల్లా పట్టుకుని నిలదీసే రోజు తప్పక వస్తుంది.

‘చాంద్‌తార’ల కవితా కౌముది



[ఈ వ్యాసం స్కైబాబా, షాజహానాలు రాసిన ’చాంద్ తారా’ కవితాసంకలనానికి పెన్నా శివరామకృష్ణ గారు రాసిన ముందుమాట]
హ్రస్వ కవితా ప్రక్రియలు మనకు పూర్వ నుంచీ ఉన్నవే. గాధాసప్తశతులూ, ముక్తకాలూ, శతక పద్యాలూ, చాటువులూ, దోహాలూ, రుబాయీ, ఘట్ కట్ షేర్లు, హైకూలు మొదలైనవన్నీ హ్రస్వ కవితా ప్రక్రియలే. ప్రపంచ పదులు, ద్విపదులు, నానీలు కూడ ఇలాంటివే. తెలుగు ప్రధాన సాహిత్య స్రవంతిలో హ్రస్వ కవితా ప్రక్రియలపట్ల చిన్నచూపు ఉన్నట్లు కనిపిస్తుంది. కొందరు వచన కవులు, విమర్శకులు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఇలాంటి ప్రక్రియల పట్ల అసహనాన్ని వ్యక్తపరుస్తుంటారు. ఇవి చమత్కార ప్రధానమైనవనీ, సామాజిక చైతన్యాన్ని కలగించలేవని మరికొందరి అభియోగం. ఇలాంటి ప్రక్రియల్లో రాయడం అపరిపక్వతకు, ప్రతిభా హైన్యానికి సంకేతమని ఇంకొందరు అంటుంటారు. మౌనం ద్వారా, ఉపేక్ష ద్వారా నిరసనను వ్యక్తం చేయడంలో, ఒక మూలకు నెట్టేయడంలో మనవాళ్లు ప్రవీణులు.
అది అలా ఉంచితే ప్రతి ప్రక్రియకూ వ్యక్తీకరణ, ప్రయోజనాలతో తనదైన పరిమితులుంటాయి. ముక్తకాలను, కావ్యంతో, భక్తి శతకాన్ని భక్తి కావ్యంతో పోల్చి చూస్తే పరిమితులు ప్రయోజన భిన్నత్వమూ తెలుస్తాయి. వచన కవితా ఖండికనే పరమోత్కృష్ట ప్రక్రియగా భావించేవారు కూడ వచన కవితను, దీర్ఘ కవితతో (లేదా కావ్యంతో) పోల్చి చూసుకుంటే పరిమితులు ప్రయోజనాల సాపేక్షత గ్రహించవచ్చు.
మంచి కవులుగా పేరుపొందిన స్కైబాబ, షాజహానా తెలుగు కవిత్వాకాశంలో ప్రస్తుతం ‘చాంద్‌తార’లుగా రూపుదాల్చారు. ‘చాంద్‌తార’ అనగానే నెలవంక ప్రమిదలో మణిదీప నక్షత్రం మనో నేత్రం ముందు సాక్షాత్కరిస్తుంది; ఇస్లాం మత చిహ్నమూ స్ఫురిస్తుంది. చాంద్‌ ఎవరైనా తార ఎవరైనా కవితా కౌముదుల్ని వెదజల్లుతున్న ఈ కవి దంపతులూ చాంద్‌తారలే. ఈ హ్రస్వ కవితల్లోని రెండు పంక్తులకూ చాంద్‌తారలు సంకేతాలే. వచన కవిత్వంలో లాగానే ‘చాంద్‌తార’లలోని పాద విభజనలో నిర్దిష్టమైన నియమాలేమీ కనిపించవు. అయినా రెండు పంక్తులుగా మాత్రమే విభజించుకోవాలని వీరు నిర్ణయించుకున్నారు. ఇందులోని అంతర్లీనమైన ముస్లిం ఆంతరిక, లౌకిక, జీవన సంఘర్షణలను ‘చాంద్‌తార’ అనే శీర్షిక సూచిస్తుంది.
ఒక్క తాన నిలుస్తలె
పైన కటీ పతంగ్‌ – కింద మున్నా
ఒకే రకమైన రెండు దృశ్యాలను మన ముందు ఉంచి వేరు వేరు కారణాలను వ్యంగ్యం చేస్తాడు స్కైబాబ. ‘విహరిస్తూ చంద్ర భ్రమరం / అడవి ఒక ఆకుపచ్చని పుష్పం’- ఎంత అందమైన భావన. అడవి నంతటినీ పుష్పంగా భావించడం- అందునా ‘ఆకుపచ్చని పుష్ప’ మనడం ఊహల్లోని, వ్యక్తీకరణల్లోని నవ్యత. ఇలాంటివి సార్వజనీనమైన వస్తువులు. సందేశం కంటే వర్ణనా ప్రధానమైనవి.
సెహ్‌రాలోని చమ్కీదారాలు
ఊచల వెనక చంద్రబింబం

మంచి ఉత్ప్రేక్ష. ‘ఊచల’ ద్వారా బందిఖానాను స్ఫురింపజేస్తాడు. ఒక స్వల్ప అంశం ద్వారా విషయాన్నంతటినీ వ్యంగ్యం చేయడం మెటానమీ. వివాహ వ్యవస్థలోని పై మెరుగుల వెనుకనున్న ప్రతికూల అంశాలను, స్త్రీల దుస్థితిని ధ్వనిస్తాడు. ‘ఉర్స్ లో రోల్డుగోల్డు హారం కొన్నది అమ్మీ / అబ్బా ముఖం చిన్నబోయింది’ – అంటూ కార్యకారణాల మధ్య కాంట్రాస్ట్‌ ద్వారా దారిద్య్రాన్ని దైన్యాన్ని చక్కగా ధ్వనిస్తాడు.
పరేషాన్‌ గుండేది చిన్నప్పుడు
మా భాష మాట్లాడే అమితాబ్ బొట్టు పెట్టిండేంది

ప్రతిపదసార్థక్యం కలిగిన కవితలలో ఇదొకటి. ‘పరేషాన్‌’, చిన్నప్పుడు’ అనే పదాలు కారణం తెలియని సంఘర్షణను, కారణాలను అన్వేషించలేని, అర్థం చేసుకోలేని అమాయకత్వాన్ని తెలుపుతాయి. ‘మా భాష’ – ఉర్దూకు సర్వనామం. ‘అమితాబ్ – సినిమా రంగానికి, ఉర్దూ మాట్లాడే హిందువులకు సంకేతం. ‘బొట్టు’- హిందూ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక.
హిందీ, ఉర్దూ భాషల ఉత్పత్తి, క్రమ పరిణామం, క్రమంగా వేరువేరు లిపులను ఆశ్రయించి, వేరువేరు భాషలుగా రూపొందడం- అయినా ఆ రెండు భాషలకున్న ఆజన్మ సంబంధ బాంధవ్యాలు- హిందీ సినిమా వికాసం లో హిందూ, ముస్లిం సంస్కృతీ సంప్రదాయాల, హిందీ ఉర్దూ భాషా సాహిత్యాల ఉమ్మడి పాత్ర- ఉర్దూ, భారతీయ ఇస్లాం సంస్కృతి అవినాభావమనే అభిప్రాయాలు- మొదలైన అనేక విషయాలను గూర్చిన లోతైన ఆలోచనలకు ఈ కవిత ప్రేరణనిస్తుంది.
పొద్దున్నె అద్దంలో మొఖం చూసుకోవాలనేది అమ్మీ
ఇప్పుడు మా అద్దం ముక్కలైంది
ఇక్కడ ‘అద్దం’ అనే ప్రతీక అనేక అన్యాయాలకు ఆస్కారమిస్తున్నది. ఇది ముస్లింల మన-స్థితిని కవి అర్థం చేసుకున్న తీరును తెలుపుతుంది. ఏమైనా ఈ కవిత చదువగానే ఒక సినిమా కోసం షకీల్ బదాయినీ రాసిన (దిల్ దియా దర్ద్ లియా -1966 -’కోయీ సాగర్ దిల్ కో బహలాతా నహీ–’ అనే గజల్) ‘జిందగీకీ ఆయినే కో తోడ్‌దో, ఇస్‌మే అబ్ కుచ్ భీ నజర్ ఆతా నహీ–’ అనే షేర్ గుర్తుకొచ్చింది. ‘పండుగనాడు దూరముండి దండం బెట్టేటోడు / అలాయిబలాయి నేర్పితి’- ‘దూరముండడం’ వెనుక చాలా విషయముంది. ఇస్లాం సంస్కృతిలోని సానుకూలమైన అంశాలను, హిందూ సంస్కృతిలోని లోపాలను ప్రతిఫలింపజేసే మాటలివి. ‘నేర్పడం’లో ఎవరికైనా ఆధిక్యతాభావమున్నట్లు అనిపిస్తే అది కవి ఉద్దేశ్యమే ననుకోవాలి.
‘షాజహానా గారి కవిత్వ కం……స్వరంలో మృదుత్వం, కటుత్వం విడదీయరానంతగా కలగలసిపోయి ఉంటాయి.
రేగుముల్లుతో ముక్కు కుట్టుకున్నా
కళ్ల వెంట పటపటమని జారిన బాల్యం
‘రేగుముల్లు’లో పేదరికపు దు—ఖపు పదును నిక్షిప్తమై ఉంది. బాల్యానికి అశ్రువులతో అభేదం చెప్పడం గమనించదగినది. ఈమె తన మొదటి కవితతోనే తన కవిత్వ వస్తుజాలాన్ని, వ్యంగ్య వైభవాత్మకమైన వ్యక్తీకరణ రీతిని స్పష్టం చేసింది. ‘పగలంతా చూసొచ్చిన వింతలన్నీ / రాత్రంతా ఒడ్డుకు చెబుతూ పడవ’- లాంటి అందమైన ప్రాకృతిక ఊహా చిత్రాలతోపాటు, చాలా కవితలలో ముస్లిం మహిళ ఆంతరిక సంఘర్షణను చిత్రించింది.
ఔరత్ ఉభయ ‘చెర’
సగం కన్నీటిలో.. సగం కలల్లో..
ఇది అందరు మహిళలకూ కొంతవరకైనా వర్తిస్తుంది. కాని ‘ఔరత్ అనే పదంతో నిర్దిష్టంగా సగటు ముస్లిం మహిళ వేదనను చెప్పింది. సౌకర్యానికి, విస్తృత ప్రయోజన సాధనకు సంకేతమైన ‘ఉభయ చరత్వా’న్ని జీవన వైఫల్య వ్యక్తీకరణకు వాడుకోవడం విశేషం. ముస్లిం బాలిక బాల్యంతో మొదలుపెట్టి ముస్లిం ‘ఔరత్ తో ముగించి- తన కవిత్వంలో ఆద్యంతమూ అంతర్లీనమైన ముస్లిం మగువ వేదనను వ్యంగ్యం చేసింది.
ఇద్దరి కవితలలోను ఉక్తి చమత్కారాల కంటే దృశ్య భావ చిత్రాలు ఎక్కువ. విన్నదాని కంటే చూసినది ఎక్కువ కాలం జ్ఞాపకానికి నిలిచినట్లు ఉక్తి చమత్కృతి కంటే దృశ్య భావ చిత్రం మనస్సు మీద చెరగని చిత్తరువులా నిలిచిపోతుంది. ఇందులో ‘షాజహానా కవితలు సంఖ్యలో తక్కువ అయినా దాదాపు అన్నీ శక్తిమంతమైనవే. ఇది లోపం కాకపోవచ్చునేమో కాని ఇద్దరి కవితలలోను భాషాపరంగా ఏకరూపత కనిపించదు.
ఒక వస్తువు, దృశ్యం కలిగించిన తాదాత్మ్యం నుంచి, ఎలాంటి బౌద్దిక ప్రమేయం లేకుండ వెలువడిన కొన్ని వీరి కవితలను ఉత్తమ హైకూలుగా కూడ భావింపవచ్చు. ఒక పెద్ద గండశిలను శిల్పంగా మలచడం వేరు. ఒక చిన్న సుద్ద ముక్కనో, గులకరాయినో శిల్పంగా తీర్చిదిద్దడం వేరు. ఇక్కడ మొదటి పనిలో గొప్ప నైపుణ్యాన్ని సాధించిన వారే రెండవ పనిలో సఫలమయ్యే అవకాశముంటుంది. ఏ కళాకారుడికైనా పరిధి తగ్గుతున్న కొద్దీ అమోఘ నైపుణ్య సాధన, ప్రదర్శనలు అత్యావశ్యక మవుతాయి. కవిత్వంలోనైతే వ్యక్తీకరణ పద్దతికి ప్రాధాన్యం పెరుగుతోంది. వచన కవత్వ సాధనవల్ల తమకు తెలియకుండానే బోధపరచుకున్న ఆలంకారికతా రహస్యాలు హ్రస్వ కవితా రచనలో అప్రయత్నంగా వినియోగిస్తాయి. మంచి వచన కావ్యం రాయగలిగిన వారికి మంచి వచన కవితా ఖండిక రాయడం బహ•శా సులభ సాధ్యమే. ప్రమాదవశాత్తు ఎవరైనా ఒక మంచి వచన కవితా ఖండిక రాయవచ్చునేమో! ప్రమాదవశాత్తు ఎవరూ మహాకావ్యం రాయలేరు.
హ్రస్వ కవితలు రాయడం తేలిక అని ఎవరైనా అనుకుంటే అది అజ్ఞాన మూలకమని నా అభిప్రాయం. మొదటే చెప్పినట్టు ప్రయోజనానికి సంబంధించి ప్రతి ప్రక్రియకూ తనదైన పరిమితులుంటాయి.
పూలను తన్మయత్వంతో చూస్తుంటావు
ప్రపంచమూ నిన్నలా చూడొద్దూ
మనుషులందరినీ స్వచ్ఛత, సరళత, నిసర్గత, సుగుణ సౌరభమూ, సహనమూ మూర్తీభవించిన మనీషులుగా తీర్చిదిద్దడానికి, లోకాన్ని ‘గులసితా–’గా మార్చడానికి బాగా ఉపకరించేది ఉత్తమ కవిత్వమే నేమో! తమ ‘చాంద్‌తార’ లతో ఉదాత్తమైన కవిత్వానుభవాన్ని అందించటమే కాక ఈ నాలుగు మాటలు రాసే సందర్భాన్ని కల్పించిన స్కైబాబ, షాజహానా గార్లకు కృతజ్ఞతలు.
                                                                                                       -పెన్నా శివరామకృష్ణ
                                                                                                        24.5.2008

స్వేచ్ఛాగీతిక-షాజహానా ‘నఖాబ్‌’ కవిత

స్త్రీ ఒక అలంకార వస్తువు
పురుషుని ఆస్తిపాస్తులలో ఒక భాగం
పిల్లల్ని కనే యంత్రం
స్వేచ్ఛ ఇవ్వగూడని మానవమృగం
లైంగికావసరాలను తీర్చే సాధనం స్త్రీ.
 - ఇటువంటి భావజాలంలో మగ్గిపోతున్న పురుష సమాజానికి మరీ ముఖ్యంగా ముస్లిం సమాజానికి ‘నఖాబ్‌’ కవిత ఒక అక్షరాస్త్రం.
 పురుష దురహంకారానికి కనువిప్పు కలిగించే కాంతిరేఖలు, షాజహానా కవితలు.  అటువంటి కొన్ని కవితలను పరామర్శించడమే యీ వ్యాసోద్దేశ్యము.
సమాజం వైరుధ్యాల కూడలి.  భిన్న సంస్కృతులు ఇక్కడ సంఘర్షించుకుంటున్నాయి.  మతాలు, మతాచారాలు మనుషుల మధ్య గోడల్ని కట్టడంలో నిపుణత్వం సాధించి, ద్వేషబీజాలను నాటడంలో ప్రావీణ్యతను సాధించాయి గాని, మానవసంబంధాలలో మైత్రీపూర్వక సామరస్యాన్ని అందించలేకపోయాయి.  బౌద్ధం తప్ప మిగతా అన్ని మతాలలో స్త్రీలపై దౌర్జన్యపూరిత అణచివేత కొనసాగుతుంది.  ముస్లిం మత సాంప్రదాయంలో ఈ నిర్బంధాలు మరీ ఎక్కువ.  ఇటువంటి స్థితిలో నుంచి వచ్చిన ప్రముఖ కవయిత్రి షాజహానా తన తిరుగుబాటు బావుటాను ఎగరవేసింది.  అది నిర్విరామంగా పురుష దురహంకారుల గుండెలపై రెపరెపలాడుతూనే వుంది.
వాస్తవికత, రమణీయత, మానవత, విచక్షణ, వివేకము లాంటి లక్షణాలు కల్గిన కవితలల్లిన షాజహానా, బాధాసర్పద్రష్టులైన ముస్లిం స్త్రీల మనోవేదనను వ్యక్తీకరిస్తూ, వారి అవమాన పరంపరలను ధ్వనిప్రాయంగా సూచిస్తూ, ఎదుర్కొనే ధైర్యాన్ని తన స్వేచ్ఛాగళం ద్వారా సాటి స్త్రీలకు అందిస్తుంది.  తన ‘నఖాబ్‌’ కవితా సంపుటిలోని తొలికవిత ‘పర్దాహటా కో దేఖో’లో ఈ విధంగా అన్నారామె:
”గుమ్మానికి కట్టినట్టే అమ్మ ముఖానికి ‘నఖాబ్‌’ కడితే స్వప్నంలాంటి జిందగీకి శాపమని అప్పట్లో తెలియనిదాన్ని”
కొంతమంది పురుషులకు గుమ్మానికి పరదా అలంకార వస్తువైతే, ఎక్కువ మందికి ఇంట్లో మహిళలు బయటివారికి కనిపించరనే ‘ధైర్యాన్ని’ ఇచ్చే వస్తువైంది.  ఇక్కడ తన ‘అమ్మీ’ ముఖానికి వేసిన ‘నఖాబ్‌’ (ముసుగు) శతాబ్దాల నుంచి, తరతరాల ముస్లిం మహిళల స్వేచ్ఛకు, ఆత్మగౌరవానికి కట్టిన ‘అడ్డుగోడగా’ షాజహానా నిజాయితీగా, ధైర్యంగా ప్రకటించింది.  ఒక మనిషికి జరిగిన అన్యాయన్ని గుర్తించడం కూడా మానవ చైతన్యంలో ఒక భాగమే!  ఒక మనిషి ఇంకొక మనిషికి ‘నఖాబ్‌’ వేయడం మానవత్వానికి ఒక మాయని మచ్చ.  ఇతర మతానుయాయులు కూడా మన కంటికి కనిపించని ‘నఖాబ్‌’లను స్త్రీలకు వేస్తున్నారనడం కాదనలేని సత్యం.  ముస్లిం సమాజం స్థిరీకరణ చెందిన భావజాలంతో జీవిస్తుంది.  ఇటువంటి తిరోగమన భావజాలాన్ని గట్టిగా షాజహానా వ్యతిరేకించింది.
ప్రస్తుతం మనిషి వైజ్ఞానికంగా పెరిగి, మనోవైజ్ఞానికంగా తరిగిపోయాడు.  అతను సహజాతలక్షణాలతో జీవిస్తున్నాడు.  అందుకే ప్రఖ్యాత కవి గాలిబ్‌ అంటాడు.
”ప్రతిది సులభ సాధ్యమ్ము కాదు సుమ్మి
నరుడు నరుడౌట ఎంత దుష్కరమ్ము” - అని
నరుడు, నరుడుగా మారటం కష్టతరమైనది.  కవిత్వ ప్రయెజనం మనిషిని, మనీషిగా చేయలేకపోయినా, మనిషిని మనిషిని చేయడమే!  అటువంటి వ్యక్తిగత, సామాజిక ప్రయెజనాన్ని షాజహానా గుర్తించింది.
షాజహానా ఒక్కొక్కసారి తనే వస్తువై పోతుంది.  ఇటువంటి స్థితిని గురించి డా|| షమీ ఉల్లా ”మైనారిటీ కవిత్వం - తాత్త్విక నేపథ్యం” అనే గ్రంథంలో యీ విధంగా అన్నారు ”వర్ణనీయ వస్తువు వర్ణించే కవిలో ఉండటం, కవికి వస్తువుకి తేడా లేకపోవడం, అలాగే వస్తువినా కవి వుండకపోవడం అంటే కవి తనను తాను రికార్డు చేసుకోవడం ఇప్పటి కావ్యంలో చూడగలం - ఫలితంగా కవే కావ్యము అవుతాడు”.
కవి అనేక వస్తువుల్ని స్వీకరించి, కవిత్వం వ్రాయడం వేరు.  తనే వస్తువై కవిత్వరీకరించడం వేరు.  అనేక వస్తువుల్లో తన రూపం చూడటం కన్నా, తానే వస్తువై కావ్యరూపం ఎత్తడంలో అనుభూతిపరమైన సాంద్రత ఎక్కువగా ఉంటుంది.  అందువల్లనే ముస్లిం రచయితలు తేలికగా తెలుగు సాహిత్యంలో తమదైన ముద్రను బలంగా వేశారు.
ఇకపోతే, కవయిత్రి షాజహానా, తన తల్లి పెండ్లినాటి ఫోటో చూసి, అప్పటి ఆమె అందాన్ని, ఇప్పటి తల్లి దైన్యాన్ని గుర్తిస్తూ షాజహానా ఎంతో ఆర్ద్రంగా, కదిలించే విధంగా అంటుందిలా:
”నీ కళ్లు కురిపిస్తున్న ప్రేమధారని గుర్తించకే కాబోలు
అబ్బాజాన్‌ నిరంతరం పరాయి నిషాలోకి తూలుతుంటాడు
బట్టలకు అత్తరద్దుకున్నట్లు
శరీరానికి ఔరత్‌ల అందాల
నద్దుకోవాలని ఆరాటపడుతుంటాడు”.
షాజహానా ‘తండ్రి స్థానంలో ఉన్న పురుషుని స్వార్థాన్ని కాముకత్వాన్ని ఎండగట్టింది.  పెరిగిన పిల్లల ఎదురుగానే తండ్రులు తల్లులను నిర్లక్ష్యపరచి ‘రసికరాజులు’గా తిరగడాన్ని షాజహానా వ్యతిరేకిస్తూ, ముస్లిం పురుషులు తమ గ్రంథం చాటున ‘బహూభార్యత్వం’ని సమర్థించడం, అనుసరించడం ‘హేయమైన’ విషయంగా ఈ కవితలో అభివ్యక్తపరచింది.
స్త్రీ భావస్వేచ్ఛకు ఏ మతమైనా చైనాగోడలా అడ్డునిలుస్తుంది.  స్త్రీవాదులు మొదట మతదృక్పథాన్ని బ్రద్దలుకొట్టాలి.  అందుకే షాజహానా మతాచారాలతో జరిగే పెండ్లితంతులోని అమానుషత్వాన్ని యీ క్రింది కవితావాక్యాలతో సమర్థవంతంగా అభివ్యక్తపరచింది ఒక కవితలో:
 ”నిజంగా నికాహ్‌ కుట్రే
 షాదీ ఐన్నాటి నుండీ
 అన్నీ నిషేధాలైపోతాయి”.
షాజహానా యీ నిషేధాలెంత కాలం అని ప్రశ్నిస్తుంది.  సాంప్రదాయ మత చాంధసవాదులు, చలం నుంచి తస్లీమా వరకు, మానసిక, శారీరక దాడులు కొనసాగిస్తూనే వున్నారు.  స్త్రీల హక్కుల్ని రక్షించడం కోసం ముస్లిం కవయిత్రులైన షాజహానా, రజియాబేగం, మొహజబీన్‌ లాంటివారు, రంగనాయకమ్మ, ఓల్గా, కొండవీటి సత్యవతి లాంటి మేధోజీవులు తమ రచనల ద్వారా సమాజంలో పీడింపబడే స్త్రీలకు ఆత్మగౌరవ రక్షణ కవచాన్ని ఏర్పరుస్తున్నారు.  ఇది మంచి మార్పు.
స్త్రీ అణచివేత ఒక నిశ్శబ్ద ఉద్యమంగా సాగే విధానం ఒకటి సవజంలో అంతర్లీనంగా ప్రవహిస్తుంది.  ఇది గుర్తించిన షాజహానా, స్త్రీ నిరోధకశక్తుల్ని యీ విధంగా బట్టబయలు చేసింది.  తన కవితలో:
 ”దుఃఖంతో ముద్దయి వాలిన    కన్రెప్పలని
 కన్నీళ్లను విదల్చుకొని…”
 ఈ మతమూ, తండ్రీ, మొగుడూ అనే వరసక్రమంలో వయస్సు మళ్లిన తరువాత సతాయించే ‘కొడుకుని’ మర్చిపోయింది, షాజహానా!
ఎన్ని కన్నీళ్లు రాలితేనో, ఎంతగా గుండెలవిసి పోతేనో, ఎంతగా అంతర్మథనం చెందితేనో,  ఎన్ని  రాత్రిళ్లు  నిద్రకు దూరమైతేనో యిలాంటి కవితావాక్యాలు వెలువడవు.  బహిర్‌ ఘర్షణ, అంతర్‌ఘర్షణ లేకుండా కాగితం, కలం కట్టుకొంటే మంచి కవితలు రావు.
షాజహానా కవయిత్రి యింకా ”వెర్రి ఆచారాల మర్రి వృక్షాలు ఉన్నచోట/ఒక్కసారి ముసుగు తీసి చూడు” అని అంటూ
మీరు బిగించిన ఇనుపసంకెళ్లను విదిల్చివేయగల
గుండె ధైర్యం నాకు చాలా వుంది - అని ముస్లిం స్త్రీలకు పోరాటానికి ఒక కత్తీ, డాలునీ అందిస్తుంది.
 ఈ విధంగా షాజహానా తన తిరుగుబాటు గళాన్ని, కవితా కళాత్మకంగా ‘నఖాబ్‌’ కవితా సంపుటిలో పలుచోట్ల వినిపించింది.
అందుకే యీ కావ్యానికి పీఠికలాంటిది వ్రాస్తూ ప్రముఖకవి డా|| ఎండ్లరి సుధాకర్‌ అన్నారీ విధంగా ”అణచివేత విషయంలో ఓ నిజం గుర్తించాలి, దళిత, హిందూ స్త్రీల కంటే ముస్లిం స్త్రీ ఎక్కువ నిర్బంధాలకు, బాధలకు గురవుతుంది.  షాజహానా రాకతో ముస్లిం స్త్రీ జీవితం గాఢంగా అక్షరబద్దమైంది” వారి అభిప్రాయం సమంజసం, సహేతుకం గూడా!
షాజహానా యీ తరహా కవితాక్షరాలు, సమాజ, సాహిత్య క్షేత్రాలలో స్త్రీ స్వేచ్ఛకు నాందీ ప్రస్తావన చేసినాయి.  ఈ స్వేచ్ఛాగీతిక ………… ఒక నిరంతర చైతన్య పతాక!
                                                                                    -ముంగర జాషువ