Saturday, October 08, 2011

నఖాబ్‌ వెనక...

(మానవ ముఖాలపై ఉన్న నఖాబ్‌లను తొలగించే పనికి షాజహానా తన కవిత్వాన్ని సంధిస్తోంది. బలమైన తెలుగు ముస్లిం కవయిత్రి షాజహానా. తన జీవిత నేపథ్యం గురించి, తన తపన గురించి, తన కవిత్వ నేపథ్యం గురించి ఆమె స్వగతం...-'నఖాబ్' కవిత సంపుటి -2005 నుంచి)

తెలియని వయసులో గుమ్మానికి పర్దా కడితే
రంగు రంగుల కుచ్చులు చూసి మురిసిపోయినదాన్ని....!
అప్పుడే స్వేచ్ఛకి మొదటి బేడీ అని తెలుసుకోలేని పసిదాన్ని....!
గుమ్మానికి కట్టనట్టే - అమ్మీ ముఖానికి నఖాబ్‌ కడితే
స్వప్నంలాంటి జిందగీకి శాపమని అప్పట్లో తెలియనిదాన్ని...

అదిగో...
అక్కడ మొదలయ్యాను నేను - ఆ గుమ్మానికి కట్టిన పర్దాలలోంచి అమ్మీలకు తొడిగిన బుర్ఖాలలోంచి నడుచుకుంటూ వచ్చాను నేను...

మా కుటుంబంలోనే కాదు.... మా బంధువుల కుటుంబాల్లో.... ముస్లిం దోస్త్‌ల కుటుంబాల్లో .... అలా ఎన్నో కుటుంబాల్లో... ఎంతో మంది ఆడపిల్లలు రకరకాలుగా బలయిపోతూనే ఉన్నారు. కనీసం తాము బలయిపోతున్నామన్న స్ప­ృహ కూడా లేదు... అది వాళ్ల తప్పు కాదు, అలా స్ప­ృహ లేకుండా చేయడమే పురుష ప్రపంచం కోరుకునేది...
చిన్నప్పటి నుంచి సాహిత్య సమావేశాలకి మా అబ్బా (దిలావర్‌) తీసుకెళుతుండేవారు. ఎంత స్వేచ్ఛనిచ్చినా ఆ స్వేచ్ఛలో కనబడని దారం ఒకటి దాగుండేది. ఆ దారం ప్రధాన శత్రువైంది నాకు. ఆ శత్రువును జయించాలన్న తపనతోనే సాహిత్యంలో కూరుకుపోయేదాన్ని. బయటి ప్రాబ్లమ్స్‌కి సాహిత్యంలో జవాబులు దొరుకుతున్నట్టు అనిపించేది. మా ఇంట్లో ఎప్పుడూ సాహిత్య వాతావరణం ఉండేది. దిలావర్‌గారు ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుంటే వినడం... అలా....

మా చుట్టాలో పదవ తరగతి తర్వాత చదివిన అమ్మాయి ఒక్కరూ లేరు. చిన్నతనంలో పెళ్లి చేసెయ్యడం, అంతలోనే తల్లులు కావడం లాంటి విషయాలు చూస్తుంటే జీర్ణమయ్యేది కాదు.. వాళ్లట్లా పెళ్లయి వెళ్లిపోవడం... బుర్ఖాల్లో మునిగిపోవడం... మళ్లీ కనిపించకపోవడం.... విపరీతంగా దుఃఖం వచ్చేది....

మొదటిసారి బుర్ఖా వేసి చూసినప్పుడు నాకు ఊపిరాడలేదు. చుట్టూతా ఒక పలుచని గోడ కట్టుకుని నడుస్తున్నట్టు అనిపించింది. అది క్రమంగా... నా ఇంటిని ఆక్రమిస్తున్నట్టు అనిపించింది. నా సొంత అక్క (షంషాద్‌ బేగం) పెళ్లవగానే ఆమెను బుర్ఖా కబళించింది. నాకది మింగుడు పడలేదు. ఆ బుర్ఖాలో మా ఆపాను వెతుక్కునేదాన్ని.

ఆ మూడు సార్ల తలాఖ్‌ కొండ చిలువ నా ఆపా నల్లపూసల్ని మింగేసింది. అలా ఎంతో మంది ముస్లిం స్త్రీలు... మా ఆపాలాగే కోర్టుల చుట్టూ గబ్బిలాల్లా తిరుగుతూనే ఉన్నారు.... వారికి న్యాయం ఎన్నటికి అందేను...?

నా ముస్లిం స్నేహితురాళ్లకు బయటకు రావడానికి అస్సలు అనుమతి దొరికేది కాదు. కొట్టాల్లో పశువుల్లాగా కట్టి వుంచడం... టైమ్‌కి వదిలేయడం... ఇలా ఆలోచిస్తూ వుంటే ఎంతో ఆవేశంగా అనిపించేది...

నేను చాలాసార్లు నా సంప్రదాయాల్ని ఎదిరించాను. చాలాసార్లు తిట్లు తిన్నాను. దెబ్బలు తిన్నాను. మా బంధువులందరూ నన్ను చిత్రంగా చూసేవారు. నాతో వాళ్లమ్మాయిల్ని సినిమాక్కాదు కదా బజారుక్కూడా పంపించేవాళ్లు కాదు.... నేనొక్కదాన్నే ఎక్కడికైనా వెళ్లి... ఏదైనా చేయగలగడం నేర్చుకున్నాను. నేను నెమ్మదిగా ఎదిరించకుండా ఉండేటట్లయితే నన్ను కూడా బుర్ఖా ఆక్రమించేది...

మనకి అయిష్టమైనదాన్ని ఎలా తిన్లేకపోతున్నామో... మనకు అసౌకర్యమైన దుస్తులను మాత్రం ఎందుకు ధరించాలి...! ఆ రకంగా ఆలోచిస్తే ముస్లిం ఆడవాళ్ల జీవితాలకు జీవితాలే అసౌకర్యాలు...!

ఊర్లలో ఆడవాళ్లు చెంబు పట్టుకుని ఊరి బైటికి వెళతారు. కానీ ముస్లిం ఆడవాళ్లకు ఆ స్వేచ్ఛ కూడా లేదు. లెట్రిన్స్‌ కట్టుకునే స్తోమత లేని ఇళ్లలో కూడా ఆడవాళ్లు బయటికెళ్లకూడదు. 'సండాస్‌'లలోకి వెళ్లాలి. అవి ఎంత జుగుప్స కలిగించే విధంగా ఉంటాయంటే.... పురుగులు లుకలుకలాడుతూ, ఎలుకలు, బొద్దింకలతో భళ్లున వాంతయ్యింది నాకు, ఒక్కసారి చూసినందుకే...! ఆ కుళ్లు కంపు జీవితాంతం అనుభవించాలి చచ్చినట్టు!

భార్యలు అందంగా ఉండాలని కోరుకోవడం, వాళ్లకి వెలుతురు, గాలీ కూడా స్వేచ్ఛగా పీల్చుకోలేని ఇరుకు గదుల్లో పడేయడం... వాళ్లని మనుషుల్లాగ చూడకుండా తమకి అన్నీ చేసిపెట్టే రోబోట్‌లాగా ఉపయోగించుకుంటున్నారు...

ఎన్ని వేలమంది అమ్మాయిలు అరబ్‌లకు అమ్ముడు పోయారో...! అరబ్బులు ఆ అమ్మాయిలను వాడుకుని ఇతరులకు అమ్మేయడాన్ని తలుచుకుంటే గుండె పగిలిపోతుంటుంది. ఇవన్నీ వింటుంటే చూస్తుంటే తెల్లటి పావురాల్లాంటి అమాయకమైన ముస్లిం ఆడవాళ్లు అచ్చం ఫారాల్లో పెంచే కోళ్లలా అనిపించేవాళ్లు. అంతకంటే ఈ ముస్లిం పురుష ప్రపంచం వాళ్లకిచ్చిందేంటి..?

వాళ్లని బందీల్లా చూడ్డం భరించలేని విషయం. పురుషులు మాత్రం ఆకర్షణీయంగా ఇష్టమైన దుస్తుల్లో తిరుగుతారు. కానీ వాళ్లు మాత్రం కలుగుల్లో ఎలుకల్లా అలా పడుండాల్సిందే.

చివరకు శ్వాస కూడా సరిగ్గా పీలవకుండా నానా రోగాల పాలు చేస్తున్న ఈ పురుష ప్రపంచాన్ని ఏం చేసినా పాపం లేదనిపిస్తుంది. ఎంత రాసినా నా కసి తీరదు. పుట్టేప్పుడు, చచ్చేప్పుడు అందరిదీ ఒకటే బాధ... పెరుగుతున్నప్పుడు మాత్రం ఇన్ని తేడాలేంటి...?

నేను ముస్లింలలో దూదేకులదాన్ని. అచ్చమైన ముస్లింలుగా ఫీలయ్యేవాళ్లు మమ్మల్ని తక్కువ చూడ్డం చూస్తే వాళ్లపై కంపరమెత్తుతుంది. మజీదుల్లోనే అలాయిబలాయిలు...! బయట మాత్రం అగ్రవర్ణ తత్వం ఒంట పట్టించుకుని పెళ్లిళ్లు, పండుగల దగ్గర తేడాలు చూపెడుతున్నారు. వెనకా ముందే తప్ప అందరం ఈ దేశ మూలవాసులమే ముస్లింలుగా మారామన్న సంగతి తెలియక మా మీద ఆధిక్య భావాన్ని ఏర్పరుచుకున్న ' అస్లీ ముస్లిం'ల కళ్లపైని పర్దాల్ని కత్తిరించాల్సిన అవసరం ఉంది.

ఇంట గెల్చి రచ్చ గెలవడమే ఇష్టం నాకు... ఇండ్లలో ఇంత అంధకారాన్ని పెట్టుకుని, బయట ప్రపంచంలో మామూలుగా ఎలా కనబడగలం? 'ప్రత్యేకమైన అవయవాలున్నాయి కాబట్టి బుర్ఖా ధరించాల్సిందే' అనే 'మిత్రుల్ని' చూస్తుంటే ఉమ్మాలనిపిస్తుంది! విశాలమైన యూనివర్శిటీల్లో చదివినవాళ్లు కూడా అంత ఇరుగ్గా ఎలా ఆలోచిస్తారో అర్థం కాకుండా ఉంటుంది. అసహనంగా ఉంటుంది.....!

ఎంత బాధ...! కనీ, కనీ జారిపోయిన గర్భసంచులు...! 'బొమ్మిడికం' చేసీ చేసీ పికిలిపోతున్న శరీరాలు..! జల్లెడయిన మనసులు...! వీటిలో ఒక్క బాధయినా ఈ మగవాళ్లనుభవిస్తున్నారా...?

పవిత్ర గ్రంథాన్ని చదివేవాళ్లు ప్రపంచాన్ని కూడా చదవాల్సిన అవసరం ఉంది. పవిత్ర గ్రంథంలో అట్లా లేదు, ఇట్లా లేదు అనేవాళ్లు తప్పుగా అన్వయించబడుతున్న విషయాల్ని, దాని వల్ల నష్టపోతున్న జిందగీల్ని సరిచేసే పనులు చేయాలి.... లేకుంటే బలైపోతున్న బతుకులకు ఈ తరువాత విలువ ఎవరు కట్టిస్తారు?

అణగారుతున్న జాతిగా ముస్లింల సమస్యలు చెప్పాల్సిన టైమ్‌లో ఈమేంటి స్వేచ్ఛనీ అదనీ ఇదనీ మాట్లాడుతుంది... బుర్ఖా, పర్దా అంటుంది అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇక్కడ బుర్ఖా కేవలం బుర్ఖా కాదు, అది ముస్లిం స్త్రీల చుట్టూ కనిపించకుండా కట్టిన ప్రహరీ గోడ...! ఈ బుర్ఖా వెనక, తలాఖ్‌ల వెనక, అనంతంగా సాగే పురుష అహంకారం కింద అమాయకంగా నలిగే ముస్లిం ఆడవాళ్ల గురించి ఎవరు రాయాలి? ఎప్పుడు రాయాలి? అసలు రాసే టైమ్‌ అంటూ ఒకటి వస్తుందా? ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ని బాధలున్నాయి, సమస్యలున్నాయి. మళ్లీ ప్రత్యేకంగా తెలంగాణ గురించేం మాట్లాడుతారు? అన్నట్లుగా ఉంది ముస్లిం స్త్రీల గురించి చెప్పొద్దనడం...!
దళితులంతా అవమానించబడినవాళ్లే అయినప్పటికీ దళిత స్త్రీ దళిత పురుషుడికి లోకువే! అలాగే ముస్లిం స్త్రీ ఇంకా ఎక్కువ అణచివేతకు గురవుతున్నది... ఆ అణచివేతను ధిక్కరిస్తూ ఇవాళ్ల కొన్ని స్వరాలే వినిపిస్తుండవచ్చు... రేపు పదులు, వందలు, వందలు, వేల సామూహిక స్వరం ముస్లిం పురుష స్వామ్యపు గల్లా పట్టుకుని నిలదీసే రోజు తప్పక వస్తుంది.

No comments:

Post a Comment